ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 1:21 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కొత్త మిత్రుల కోసం జగన్ వ్యూహాలు

కొత్త మిత్రుల కోసం జగన్ వ్యూహాలు

విజయవాడ, సెప్టెంబర్ 23, (అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 23)

2024 ఎన్నికల ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో లాగా ఒంటరి పోరాటం చేయడానికి ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. కూటమి భుత్వం అత్యంత బలంగా ఉండటం, క్షేత్రస్థాయిలో వైసీపీ కేడర్ చెల్లాచెదురు కావడం, వరుస కేసులు, అరెస్టులతో .. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రత్యక్షంగా , పరోక్షంగా అదనపు బలాల కోసం ఆరాటపడుతున్నారు. తాము ఎవరితోనైనా కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి పదే పదే సంకేతాలు పంపుతున్నా.. అటువైపు నుండి సానుకూల స్పందన కరువైంది.జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం ఆయన పరోక్ష రాజకీయంపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వ్యవస్థలను, కూటమి నేతలను టార్గెట్ చేయడానికి జోసఫ్ రావణ్ వంటి వారిని భారీ బడ్జెట్‌తో రెడీ చేసుకుని, షాడో పాలిటిక్స్ నడుపుతున్నారు. కానీ, ప్రత్యక్షంగా తన ఓటు బ్యాంకుకు అదనపు ఓటు బ్యాంకును జోడించగల బలమైన పార్టీలను మాత్రం ఆయన దరిచేర్చుకోలేకపోతున్నారు. మరోవైపు జడ శ్రవణ్ కుమార్ వంటి నేతలు, దళిత ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తూ జగన్ రాజకీయాలలోని లోపాలను ఎండగడుతున్నారు. ఇది వైసీపీకి కోలుకోలేని దెబ్బగా పరిణమించే అవకాశం ఉంది.ప్రస్తుత రాజకీయ సమీకరణాలలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం ఏమాత్రం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఉనికి నామమాత్రంగానే ఉన్నా, జాతీయ స్థాయిలో ఆ పార్టీతో వైసీపీ బంధం కుదరదు. పైగా, రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలిగా ఉన్న తన సోదరి వైఎస్ షర్మిల తో ఉన్న తీవ్రమైన ఆస్తుల వివాదం, రాజకీయ వైరం కారణంగా జగన్ కాంగ్రెస్‌తో వెళ్లాలనుకున్నా వెళ్లలేరు. ఇక మిగిలిన ప్రధాన పార్టీలన్నీ కూటమిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కనీసం కమ్యూనిస్టు పార్టీలైనా వైసీపీతో కలిసి వస్తాయని జగన్ ఆశిస్తున్నారు. ఇందుకోసం లెఫ్ట్ పార్టీల నేతలతో వైసీపీ రాయబారాలు నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.కనీసం లెఫ్ట్ పార్టీలైనా వైసీపీతో కలిసి నడుస్తాయా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కమ్యూనిస్టు పార్టీలు సిద్ధాంతపరంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంట్‌లో పదేళ్లపాటు పరోక్షంగా పూర్తి మద్దతు ఇచ్చిన వైసీపీతో కమ్యూనిస్టులు కలవడం అంత ఈజీ కాదు. పైగా, గత వైసీపీ హయాంలో అమరావతి రైతుల పోరాటం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, ఉద్యోగుల సమస్యలపై లెఫ్ట్ పార్టీలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాయి. ఇప్పుడు అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపితే.. ఆ పార్టీల విశ్వసనీయత దెబ్బతింటుందని కొందరు లెఫ్ట్ నేతలు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను వాడుకోవడానికి సిద్ధాంతాలను పక్కనబెట్టి వైసీపీతో జతకడతారా? లేదా ఒంటరి గానే పోరాడతారా? అన్నది వేచి చూడాలి.నలుగురు మిత్రులు లేకుండా రాజకీయం చేయడం ఎంత కష్టమో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అర్థమవుతోంది. పరోక్ష వ్యూహాలు కొంతవరకు బజ్ క్రియేట్ చేయగలవు కానీ, ప్రత్యక్షంగా ఎన్నికలలో గెలవాలంటే బలమైన సామాజిక, రాజకీయ సమీకరణాలు అవసరం. ఒకవైపు తన ఓటు బ్యాంకును జడ శ్రవణ్ వంటి వారు టార్గెట్ చేస్తుంటే, మరోవైపు మిత్రపక్షాల కోసం సజ్జల రామకృష్ణారెడ్డి పంపుతున్న సందేహాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం కమ్యూనిస్టులైనా వైసీపీతో కలవకపోతే.. రాబోయే రోజుల్లో వైసీపీ ఉనికి మరింత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.